పుష్ప వైభవం
సప్తవర్ణ శోభిత పూదోటల్లో విహరిస్తున్నప్పుడు మనసు పరవశిస్తుంది. భగవంతుడి అద్భుత సృష్టిలోని విశిష్టత బోధపడుతుంది. వివిధ రంగుల పువ్వులు కంటికి ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. సువాసనలు వెదజల్లే సుమాలను ఇష్టపడని వారుండరు. పూజాద్రవ్యాలలో పూలకే పెద్దపీట. సహస్ర నామార్చనకు సుమ సౌరభం తోడైనప్పుడు భగవంతుడు ప్రీతిచెందుతాడు.
శ్రీ మహావిష్ణువు అలంకార ప్రియుడు. తిరుమలలో శ్రీ వేంకటేశ్వరస్వామికి అచ్చంగా పువ్వులతో చేసే అలంకరణను తోమాలసేవ అంటారు. స్వామివారికి ఆపాదమస్తకం చేసే ఈ పుష్పాలంకరణ సేవలో పాల్గొన్నవారి మనసు అనే పుష్పం శ్రీవారి పాదాలచెంత చేరి జన్మ ధన్యమవుతుందని చెబుతారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలలోనైతే ఆలయ ప్రాంగణమంతా పుష్పాలంకరణతో అలరారుతూ చూపరులకు నయనానందకరంగా ఉంటుంది. ఆ ఉత్సవాల అనంతరం ఏటా కార్తీకమాసంలో శ్రవణా నక్షత్రం రోజున శ్రీవారి కల్యాణమండపంలో జరిగే పుష్పయాగమూ చూసి తీరాల్సింది. ఈ రోజుల్లో దైవార్చనకు వాడిన పువ్వులను వృథాగా పారవేయట్లేదు. వాటితో అగరుబత్తులు, పరిమళద్రవ్యాలు తయారుచేస్తున్నారు. ఆ విధంగా అవి రెండుసార్లు భగవంతుడికి సేవజేసుకునే భాగ్యానికి నోచుకుంటున్నాయి.
కమలనాభుడు విష్ణుమూర్తి. కమల సంభవుడు బ్రహ్మ. శ్రీమహాలక్ష్మికి ఎర్ర తామర పూలంటే ఇష్టం. సరస్వతీ దేవికి అత్యంత ప్రీతికరమైనది తెల్ల తామర. ‘చంపకాశోక పున్నాగ సౌగంధికలసత్కచా’ అని లలితా సహస్ర నామ స్తోత్రంతో అమ్మవారిని స్తుతిస్తాం. రుక్మిణీదేవి పద్మం వంటి శరీర పరిమళం కలిగి లక్ష్మీదేవి అంశతో జన్మించిందన్నది భాగవత కథనం. దేవదానవులు సముద్రాన్ని చిలుకుతున్నప్పుడు లక్ష్మీదేవి ఆవిర్భవించింది. బ్రహ్మదేవుడు లక్ష్మీదేవిని సృష్టించినప్పుడు వికసించిన ఎర్రతామరల కొలనులో సుగంధం వ్యాపించింది. తుమ్మెదల ఝంకార ధ్వనులతో కూడిన కలువపూల దండ పట్టుకుని లక్ష్మీదేవి మేఘాల నడుమ మెరిసిపోయే బంగారంలా దేవతల మధ్య నిలుచుందని భాగవతం వర్ణించింది. బిల్వ పత్రాలు, ఉమ్మెత్త, జిల్లేడు, గన్నేరు, జాజి, మల్లె, పారిజాత పువ్వులతో శివుణ్ని పూజిస్తే ఉత్తమ ఫలాలనిస్తాడని శివపురాణం చెబుతోంది. భగవంతుడికి ప్రీతి పాత్రమైన పుష్పాలు మనుషుల మనసులనూ మురిపిస్తాయి. అందుకే వాకిట్లో ఓ పూల మొక్క పెట్టుకోవాలని ప్రయత్నించని వారుండరు. ప్రేమను వ్యక్తపరచడానికి గులాబీ సహకరిస్తుంది. శకుంతల కణ్వమహర్షి ఆశ్రమంలో పెరుగుతున్నప్పుడు చెట్లకు బాధ కలుగుతుందని ఒక్క ఆకు కూడా తుంచి ఎరుగదట. అవి మొదటిసారి పుష్పించినప్పుడు శకుంతల పండుగ చేసేదని కాళిదాసు వర్ణించాడు.
కనువిందు చేసే రంగులతో, మైమరపించే సువాసనలతో సూర్యోదయం కాగానే శుభోదయం చెప్పే పూబాలలను భగవంతుడి దరికి చేర్చే భాగ్యం మానవమాత్రులకు మాత్రమే లభించింది. నిర్మలత్వానికి, అమాయకత్వానికి, దైవత్వానికి ప్రతిరూపంలా ఉండే పువ్వులు నిష్కల్మషమైన హృదయానికి ప్రతీకలు. భగవంతుడి పాదాలదగ్గర పువ్వులను ఉంచడమంటే భక్తుడు తన హృదయాన్ని ఆయనకు సమర్పించుకున్నట్లే!
సర్వేజనా సుఖినో భవంతు
- వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
శ్రీ విధాత పీఠం
Ph. no: 9542665536 #sreevidhathapeetam #astroremedies #Astrology #muhurtham #vastu #vastutips #numerology
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి