గణపతి వైభవo


 

గణపతి వైభవo -1

[గణపతి నవరాత్రుల సందర్భoగా....]

ఓo శ్రీ మహాగణాధిపతయే నమః

ఓo శ్రీ గురుభ్యోనమః 

తొoడము నేకదంతము 

తోరపు బొజ్జయు వామహస్తమున్

మెండుగ మ్రోయుగజ్జెలును 

మెల్లని చూపులు మందహాసమున్ 

కొండొక గుజ్జురూపమున  

కోరిన విద్యలకెల్ల నొజ్జయై యుండెడి 

ఓ పార్వతీ తనయా ఓయీ గణాధిప నీకు మ్రొక్కెదన్

 ప్రతి సంవత్సరం భాద్రపద శుద్ధ చతుర్ధి రోజు మనం వినాయకచవితి పండుగని జరుపుకుంటాము.  ఈ భాద్రపద శుద్ధ చతుర్ధి రోజు గజాననునికి విఘ్నాదిపత్యంబు ఒసంగబడియెను.  అందువలన ఈ స్వామి శుభాశీస్సులకై  ప్రతి సంవత్సరం మనం ఈ  పండుగ జరుపుకొంటాము. 

గణపతిని పూజించకుండా ఎలాంటి శుభ కార్యము తలపెట్టము. మంగళకరమైన కార్యాలలో వాటిల్లే విఘ్నాలను తొలగించేవాడు కనుక ఈయన విఘ్నేశ్వరుడుగా ఆరాధింపబడుతున్నాడు.  ఆయన కృపాకటాక్షాలతో సకల కార్యాలు  నిర్విఘ్నముగా నెరవేరుతాయి విఘ్న నిర్మూలనముకై అవతరించి మంగళ స్వరూపుడై సకల మానవాళికి ఆరాధ్యమూర్తియై నిలిచాడు. 

 వినాయకచతుర్థి రోజు అందరు ప్రాతఃకాలమునే నిద్రమేల్కాంచి అభ్యంగనస్నానం ఆచరించి పట్టువస్త్రాలను ధరించి, పూజా సామాగ్రినంతా సిద్ధం చేసుకొని, మండపాన్ని ఏర్పరచి మట్టి వినాయకుడి విగ్రహాన్ని ఆవాహన చేసి, శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి, స్వామికి  ఇష్టమైన కుడుములు, అపూపములు, టెంకాయలు, పాలు, తేనే, అరటిపండ్లు, పాయసం, పానకం, వడపప్పు మొదలైన నైవేద్యాలు సమర్పించి, వ్రతకధను చదువుకొని, కధాక్షతలని శిరస్సున ధరించి, భ్రాహ్మణులను సత్కరించి, ఆనందంతో అందరు కలసి ప్రసాదాలని స్వీకరించి, గణేశ భజనలతో, కీర్తనలతో, పురాణశ్రవణంతో ఆయన మీదే మనసులగ్నం చేసి, ఎంతో భక్తిశ్రదలతో ఈ పండగను మనం జరుపుకుంటాము.  ఇది మనందరికి ఎంతో ఇష్టమైన పండుగ.

 అసలు ఈ గణపతి ఎవరు - ఈ  గణాధిపత్యం అంటే ఏమిటి ?

ఓం గణానాం త్వా గణపతిగ్o  హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమమ్!

జ్యేష్టరాజం బ్రహ్మణాo  బ్రహ్మణస్పత 

ఆ నః శృణ్వన్నూతిభిస్సీద సాదనమ్ !

మహాగణపతియే  నమః ।। ఓం ॥

గణపతి సర్వవిద్యాధిదేవతగా, వేదకాలము నుండి ఆరాధింపబడుతున్న అతి ప్రాచీన దేవత. వేదములలో స్తుతించబడి, గణములకు అధిపతియై, శబ్దములకు రాజుగా, ప్రణవ స్వరూపుడై  శబ్దబ్రహ్మగా తెలియబడుచున్నాడు•.  

"గ" శబ్దం బుద్దికి "ణ" శబ్దం జ్ఞానానికి ప్రతీక

సమస్త మంత్రములలోను శక్తికి కారణములైన బీజాక్షరములన్నింటిలోకి ముందుగా ఉచ్చరించబడేదే  "ఓంకారము"  అందుచేత ఈ గణపతిని ఓంకార స్వరూపుడిగా "గణపత్యధర్వ శీర్షము" లో వర్ణించారు.  

గణములు అనగా అక్షరములతో ఏర్పడే ఛందస్సు  - గురువు, లఘువు, పూర్ణానుస్వార, అర్ధానుస్వార రూపమై శబ్దంగా వెలువడే మంత్రస్వరూపమైన శబ్దాలకి అధిపతే ఈ "గణపతి".  అంతేకాకుండా "బ్రహ్మణస్పతి" అంటే వేదాలకి నాయకుడివి అని కీర్తించారు.

గణపతి విష్ణుస్వరూపుడు:

శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం!

ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోప శాంతయే !

ఇక్కడ వినాయకుడు "విష్ణుం"  అని పిలవబడినాడు. విష్ణువుగా చెప్పబడినాడు. విష్ణుం అంటే సర్వవ్యాపకుడు, స్థితి కారకుడు. అంతేకాకుండా క్షీరసాగర మధనానికి విఘ్నం కలిగిందని స్వయంగా శ్రీమహావిష్ణువే దేవతలచే గణపతి పూజ చేయించాడు.

సృష్టి ఆదిలో దేవతా గణముల ప్రారంభం కంటే ముందే గణనాధుని తో సృష్టి ప్రారంభించినట్లు గణేశ పురాణం తదితర పురాణాలు మనకి సూచిస్తున్నాయి. 

సృష్టి ప్రారంభానికి ముందు ఒకప్పుడు అమ్మవారు రాక్షసులతో యుద్ధం చేస్తున్నది.  ఇంకా మనుషులే పుట్టక ముందు అన్నమాట. అమ్మవారు పరమేశ్వరుణ్ణి తలచుకొన్నది . ఆయన అక్కడ ఉన్నారు. వారి చూపులు కలసినవి. ఆ చూపుల కలయికకి విఘ్నేశ్వరుడు పుట్టాడు. అంతటి పూర్వుడాయన. ఆయన పేరు మహాగణపతి. ఆ మహాగణపతి అవతారాలనే ఇప్పుడు మనం ప్రతి కల్పం లోనూ పూజిస్తున్నాం. 

గణేశుని (4) అవతారాలు:

 గణేశ  పురాణం ప్రకారం గణేషుడు (4) అవతారాలుగా ఆవిర్భవిస్తాడని అవి (4) యుగాలలో ఒకొక్క యుగానికి ఒకొక్క అవతారంగా చెప్పబడ్డాయి.

1. మహోత్కట వినాయక :

ఈయన  కస్యపప్రజాపతి - అదితి ల కొడుకుగా కృతయుగంలో అవతరించారు. 

పది చేతులతో, ఎఱ్ఱని శరీర ఛాయతో సింహ వాహనుడై -- నరాంతక, దేవాంతక అనే రాక్షసులని సంహరించినట్లు చెప్పబడింది.

2. మయూరేశ్వర వినాయక : 

ఈయన శివపార్వతుల కొడుకుగా త్రేతాయుగంలో అవతరించారు.  

ఆరు చేతులతో, తెల్లని ఛాయతో, నెమలి వాహనంగా సిన్దురాసురుడు మొదలైన రాక్షస సంహారం కావించాడు.

3. గజానన వినాయక : 

ఈయన శివపార్వతుల కొడుకుగా ద్వాపరయుగంలో అవతరించారు. ప్రస్తుత మన విఘ్న వినాయకుడు ఈయనే.  

ఎర్రని శరీరఛాయతో, నాలుగు బాహువులతో, మూషిక వాహనముతో. కుడివైపు రెండు చేతులలో  ఏక దంతమును,  అంకుశమును ధరించి,  ఎడమ వైపు రెండుచేతులతో పాశమును,

మోదకమును ధరించి గజవదనంతో, తొండము కుడివైపు వంపుతిరిగి ఉండును. 

4.ధూమ్రకేతు వినాయకుడు : 

ఈయన బూడిద రంగులో, నాలుగుచేతులతో, నీలంరంగు గుర్రం వాహనంగా, కలియుగాంతంలో, విష్ణుమూర్తి, కల్కి అవతారంలో అవతరించినప్పుడు, ధూమ్రకేతు వినాయకుడు కూడా అవతరిస్తాడు.

మూలాధార స్థితుడు గణపతి: 

"త్వం మూలాధార స్తితోసి" అని శ్రుతి చెప్పే రహస్యం. కల్పాదిలో విష్ణు నాభికమలం నుంచి ఉద్భవించిన బ్రహ్మగారికి, విష్ణుమూర్తి సృష్టి భాద్యతను అప్పచెప్పారు.  కాని ఎలా చెయ్యాలో చెప్పకుండా యోగనిద్రలోకి వెళ్ళిపోయారు.  బ్రహ్మ ఏం చెయ్యాలో తెలియక చాల సంవత్సరాలు తపస్సు చేసి విష్ణుమూర్తిని ప్రసన్నం చేసుకొని సృష్టి ప్రారంభించారు. 

ప్రారంభంలో జీవకోటిని, ముఖ్యంగా మానవుల్ని సృజించటంలో కొంత తికమక పడటం జరిగింది, అప్పుడు మళ్ళా విష్ణుమూర్తిని ప్రార్ధించగా, ఆయన మహాగణపతిని ప్రార్ధించమని చెప్పారు. 

 బ్రహ్మ, మహాగణపతిని ప్రార్ధించగా ఆయన ప్రత్యక్షమై, "మూలాధరమనే చక్రాన్ని సృష్టించు, అక్కడనుండి సహస్రార కమలందాక నిర్మాణం చెయ్యి.  ఆ మూలాధారచక్రంలో నేను అధిష్టాన దైవంగా ఉండి నీవు సృష్టించే జీవులకు దేహాత్మ భావనను కలుగచేస్తాను" అని చెప్పారు.

శరీరంలోని షట్చక్రములలో అన్నిటికన్నా అడుగున ఉండే చక్రము "మూలాధార చక్రo". ఈ మూలాధార చక్రానికి అధిపతి వినాయకుడు. 

దీనిలో ఇంకో రహస్యం  కూడా ఉంది. "మహాశక్తి" అయిన పార్వతీదేవికి  "ద్వారపాలకుడుగా" గణపతిని పెట్టినట్టు మనపురాణగాధ.  దీనిలో అంతరార్ధం ఏమిటంటే,  మూలాధారంలో కుండలినీశక్తి యోగనిద్రలో నిద్రిస్తూ ఉంటుంది అని, ఈ కుండలిని శక్తియే  మహాశక్తి. అ మూలాధారంలో కుండలిని శక్తిని మేల్కొలపడానికి  ప్రవేసించే ద్వారంవద్దనే గణపతి కావలిగా ఉన్నాడు.  

అనగా గణపతి బీజాక్షరంతో మూలాధారాన్ని చైతన్యవంతం చేస్తే  శక్తిని మేల్కొలుపుట సాధ్యపడుతుంది.  

మూలాధారంలో మేల్కొన్న కుండలిని శక్తి  "ఇడ"  "పింగళ " నాడుల ద్వారా షట్చక్రములను భేదించి సహస్రారం చేరుతుంది. 

యోగికి  "సిద్ధి"  "బుద్ధి"  కలుగుతుంది.  ఈ బుద్ది, సిద్ది - ఇడా, పింగళ అనే జంటలే సుషుమ్నా నాడిలో నివసించు గణపతికి భార్యలు అని చెప్పబడినాయి•.  

     [గణపతి వైభవం - ఇంకావుంది.... ]

సర్వేజనా సుఖినో భవంతు 

శుభమస్తు
  1. వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.

    జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర

    HAVANIJAAA
    (M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB)
    శ్రీ విధాత పీఠం
    Ph. no: 
    9542665536

#ganapathivaibhavam #vinayakachavithi #sreevidhathapeetam #astroremedies #Astrology #muhurtham #vastu #vastutips #numerology

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

మొత్తం నాలుగు యుగాలు ఏ యుగం ఎలా ఆరంభమైంది.? ఎలా ముగిసింది.?

రాశిఫలాలు - జులై 11, 2025

రాశిఫలాలు - జులై 22, 2025