నామస్మరణ ఎప్పుడు చేయాలి?
ఈరోజుల్లో చాలా మంది అనే మాట ఏంటంటే, యుక్త వయసు లోనే, ఎందుకు నామస్మరణ చేయాలి? - ఎప్పుడో రిటైర్మెంట్ అయ్యాక, తాపీగా ఏమి పనిలేనప్పుడు, నామస్మరణ, ధ్యానం, సేవలు అన్నీ చేసుకోవచ్చు గదా అని!!!
సీ॥ బ్రతికినన్నాళ్లు నీ భజన తప్పను గాని
మరణకాలమునందు మరతునేమొ!
ఆ వేళ యమదూతలాగ్రహంబున వచ్చి
ప్రాణముల్ పెకలించి పట్టునపుడు
కఫవాత పైత్యముల్ కప్పగా భ్రమచేత
గంప ముద్భవమంది, కష్టపడుచు
నా జిహ్వతో నిన్ను నారాయణా! యంచు
బిలుతునో! శ్రమ చేత బిలువలేనొ!
తే॥ నాటికిప్పుడె చేసెద నామభజన
దలచెదను జేరి వినవయ్య ధైర్యముగను
భూషణ వికాస! శ్రీధర్మపుర నివాస!
దుష్టసంహార! నరసింహ! దురితదూర!...
బతికి ఉంటే నీ భజన తప్పకుండా చేస్తాను, అందులో ఏ రకమైన అనుమానమూ లేదు...
కానీ, మరణం ఆసన్నమైనప్పుడు మరచిపోతానో ఏమో! అని అనుమానం, మరణం అనేది ఇష్టం లేకపోవడం వల్ల, మాయ కమ్ముకోవడం వల్ల, మరణ అనుభవం ఇదివరకు లేకపోవడం వల్ల, ప్రతీ మనిషి మరణం అంటే ఏదో చిన్నపాటి విషయం అన్నట్టుగా అనాదరంగా తోసివేస్తాడు...
కానీ, మరణ సమయంలో యమదూతలు ప్రాణాలు పెకిలించి పట్టుకునేటప్పుడు, వెయ్యి తేళ్ళు కుట్టిన బాధ కలుగుతుంది. అప్పుడు మనం చేసిన జపం, నామస్మరణ, మంచిపనుల, మరియు చెడుపనుల సంఖ్య అర్థమవుతుంది. అప్పుడు యేమి చేయలేము. శరీరం మనం చెప్పిన మాట వినదు...
ఎందుకంటే ఇంతకాలం బతికి బట్టకట్టడానికి సాయం చేసిన కఫవాత పిత్తాలు ఇక ఇప్పుడు మనిషిని మట్టుపెట్టడానికి పూనుకుంటాయి, అంటే, ఇన్నాళ్లూ జీవించడానికి సహకరించినవి, ఇప్పుడేమో మృత్యువుకు సహకరించడం మొదలుపెడతాయి.
ఉన్నఫళంగా, సమస్థితిలో ఉండాల్సిన కఫవాత పిత్తాలు విషమస్థితిలోకి మారిపోతాయి...
శరీర వ్యవస్థలో అస్తవ్యస్త పరిస్థితి తాండవిస్తుంది,
మనిషి వణికిపోతాడు, కాళ్లు నడవలేమంటూ కుంటుబడతాయి, చేతులు పనిచేయలేమని చచ్చుబడతాయి, కండ్లు చూడలేక మూసుకుపోతుంటాయి, అన్ని అవయవాలూ కూడబలుక్కున్నట్టుగా ఒకేసారి సహాయ నిరాకరణ మొదలుపెడతాయి...
అవన్నీ చెప్పుచేతల్లో ఉన్నన్ని రోజులూ ఏ లోటూ కనిపించదు, ఇప్పుడు ప్రతిదీ లోటుగానే అనిపిస్తుంది...
అలాంటప్పుడు చేతనైంది భగవంతుడి నామం ఒక్కటే! చిత్రం ఏమంటే చేతకానిది కూడా అదే! కానీ, చేయదగినది మాత్రం అదే! అదొక్కటే! అన్ని ఆరాటాలూ, పోరాటాలూ కట్టిపెట్టిన తర్వాత భగవంతుడి నామామృతం గ్రోలి పరవశించడానికి చిక్కిన సదవకాశం అది...
తర్వాతి జన్మకు పదిలమైన పునాదులు అలా చేసినప్పుడే పడతాయి...
శరీరంలో జవసత్వాలు ఉన్నప్పుడు, దైవనామ స్మరణ అనగానే ఏదో సాకుతో తప్పించుకుంటాం...
‘తీరిగ్గా భగవన్నామం చేయడానికి ఇప్పుడు కుదరదండీ! అత్యవసర కార్యాలున్నాయి’ అని పనులెన్నో తగిలించుకుంటాం.
ఆ పనులే అవసరం అని భావిస్తాం, అలా అనుకునేలా చేస్తుంది మోహం! అన్నీ అనవసరమైన పనులే అయినా, అత్యవసరాలుగా అనుకుంటాం! పైగా, అవే నన్ను వదలడం లేదని ప్రకటనలు చేస్తుంటాం...
మోహం వదలనంతవరకు కాలం ఇలా మోసం చేస్తూనే ఉంటుంది...
ప్రాణం పోయే సమయం వచ్చినప్పుడు డబ్బుకోసం తాను పడిన కష్టాలు పనికొస్తున్నాయా?
కొలువు కోసం పడిన పాట్లు పనికొస్తాయా?
పేరు ప్రతిష్ఠల కోసం పడిన ఆరాటం ఉపకరిస్తుందా?
అని ప్రశ్నించుకుంటే ఏదీ పనికిరాదని తెలియవస్తుంది...!!
ఇన్నాళ్లూ పడిన ఏ శ్రమా ప్రాణాన్ని తిరిగి స్వస్థానంలో నిలబెట్టడానికి ఉపకరించదని సమాధానం వస్తుంది...ఆ జవాబు తన గుండె లోతుల్లోంచి ఉబికివచ్చి కన్నీరై, అవసాన దశలో మనిషి నిస్సహాయతను వెక్కిరిస్తుంది, శరీరమే కాదు మాట, మనసు కూడా మన వశంలో ఉండవు...
‘నారాయణా!’ అని మనస్ఫూర్తిగా పిలువగలరో లేదో ... అందుకే ‘ఇప్పుడే నామ భజన చేయాలి!!...
- వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర, వాస్తు విశారద, విశిష్ట ఆచార్య
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB, BSC, BEd, MCA, GNIIT.
శ్రీ విధాత పీఠం
Ph. no: 9542665536#sreevidhathapeetam #astroremedies #Astrology #muhurtham #vastu #vastutips #numerology
సర్వేజనా సుఖినో భవంతు
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి