మంచి మనసుతో చేసే దానం.. అది గంజి అయినా, అమృతమే
మంచి మనసుతో చేసే దానం.. అది గంజి అయినా, అమృతమే
కర్మ పరిపాకం
బుద్ధభగవానుడి కాలంలో అనాథపిండకుడనే వైశ్యోత్తముడుండేవాడు. ఆయనకు బుద్ధుడి మీద అపారమైన భక్తి. ఆయన జేతవనంలో యాభైనాలుగు కోట్లు ఖర్చు చేసి గొప్ప ఆరామం కట్టించాడు.
ఆయన విధిగా రోజుకు మూడుసార్లు బుద్ధ భగవానుణ్ణి చూసి వచ్చేవాడు. ఎప్పుడైనా బుద్ధుడే తన అనుచరులతో సహా ఆయన ఇంటికి భిక్షకు రావటం కూడా జరుగుతూండేది.
ఈ అనాథపిండకుడికి ఏడంతస్థుల మేడ ఉన్నది. దానికి ఏడు ప్రాకారాలు. వాటిలో మధ్య ప్రాకారం మీద ఒక క్షుద్రదేవత తన సంతానంతో సహా నివాసం ఉంటూ ఉండేది.
ఈ దేవతకు బుద్ధుడంటే బొత్తిగా పడదు. ఆయన తాను ఉండే ఇంటికి అప్పుడప్పుడూ వస్తూండటం ఆ దేవతకు ఎంతమాత్రం నచ్చలేదు. ఆమె మానవ స్త్రీ రూపం ధరించి అనాథపిండకుడి ఖజానాదారు వద్దకు వెళ్ళి, ‘‘ఈ ఇంటికి బుద్ధుణ్ణి ఎందుకు రానిస్తారు? అటువంటివాడు గడపలో అడుగు పెట్టడం ఇంటికి చెరుపు!’’ అన్నది. ఖజానాదారు ఆమెను తిట్టి పంపాడు.
తరవాత ఆమె అనాథపిండకుడి కొడుకు దగ్గిరికి వెళ్ళి, అదే విధంగా మాట్లాడి, అతనిచేత కూడా తిట్లు తిన్నది. చేసేదిలేక, అప్పటికా క్షుద్రదేవత ఊరుకున్నది.
అనాథపిండకుడికి ఖర్చు నానాటికీ హెచ్చిపోయి, రాబడి తగ్గిపోతున్నది. ఆయన వ్యాపారం ఏమాత్రమూ చూడటం లేదు. ఇది కూడా గాక ఆయనకు ఇతరత్రా నష్టం కలిగింది. సాటి వ్యాపారస్థులు ఆయనవద్ద పద్ధెనిమిది కోట్ల సొమ్ము అప్పుగా పుచ్చుకున్నారు.
దానిని వాళ్ళు తిరిగి ఇవ్వలేదు, ఆయన అడగనూ లేదు. మరొక పద్ధెనిమిది కోట్ల ధనం బిందెలలో ఆ చిరవ నదీ తీరాన పాతి పెట్టిస్తే, నదికి వరదలు వచ్చి నదిఒడ్లు కరిగి, ఆ బిందెలు కాస్తా సముద్రంలోకి కొట్టుకు పోయాయి.
వీటి ఫలితంగా అనాథపిండకుడు పేదవాడైపోయాడు. ఆయన భిక్షువులకింకా భోజనాలు పెడుతూనే ఉన్నాడు గాని, వెనకటి విందులిప్పుడు లేవు. ఒకనాడు బుద్ధభగవానుడు అనాథపిండకుడిని, ‘‘ఇంకా దానాలు చేస్తూనే ఉన్నావా?’’ అని అడిగాడు. అనాథపిండకుడు ఎంతో ఆవేదన పడుతూ, ‘‘స్వామీ, దానాలైతే చేస్తూనే ఉన్నాను గాని, నేనిప్పుడు దానం చేసేది గంజి మాత్రమే!’’ అన్నాడు.
బుద్ధుడాయన బాధను గమనించి, ‘‘విచారించకు, నాయనా! దానం చేసేవారి హృదయం మంచిదిగా ఉన్నంత కాలమూ, చేసే దానం గంజే అయినా.. అది అమృతమే అవుతుంది,’’ అన్నాడు ఓదార్పుగా.
అనాథపిండకుడు పేదవాడైపోయాడు గనక ఇప్పుడు క్షుద్రదేవత ధైర్యంగా ఆయనవద్దకే వెళ్ళి, ‘‘ఏమయ్యా, ఇంకాఈ బుద్ధుణ్ణి ఎందుకు చేరనిస్తావు? హాయిగా నీ వ్యాపారం చూసుకో... పోయిన డబ్బంతా తిరిగి సంపాదించుకో... నేను మీయింటి నాలుగో ప్రాకారం మీద ఉండే దేవతను. నీ మంచి కోరి చెబుతున్నాను,’’ అన్నది.
అనాథపిండకుడు ఆమెతో, ‘‘తక్షణం నా ఇల్లు వదిలి వెళ్ళిపో,’’ అన్నాడు కోపంతో. ‘‘పోక, నువ్వు చెప్పేవరకు ఇక్కడే కూర్చుంటాననుకున్నావా ఏమిటి? ఇంతకన్న మంచి ఇళ్ళే దొరుకుతాయి!’’ అంటూ ఆ క్షుద్రదేవత అప్పటికప్పుడే తన పిల్లల మూకను వెంటబెట్టుకుని అనాథపిండకుడి ఇల్లు విడిచి వెళ్ళిపోయింది.
కానీ. ఆమె ఎంత వెతికినా అంత మంచి ఇల్లు మరొకటి దొరకలేదు. ఎక్కడెక్కడో వెదికి చూసింది. అయినా ప్రయోజనం లేక పోయింది.
అటువంటి ఇల్లు వదిలినందుకు ఆమెకు పశ్చాత్తాపం కలిగింది. కాని విడిచి వచ్చిన ఇంటికి తిరిగి ఏ ముఖం పెట్టుకుపోవాలో తెలియక, ఆమె గ్రామదేవత సలహా కోసమై వెళ్ళింది.
‘ఆ ఇల్లు విడిచి రావడం నీదే పొరపాటు. మళ్ళీ అక్కడికి వెళ్ళాలంటే ఒక పని చెయ్యి. అనాథపిండకుడికి వర్తకులు పద్ధెనిమిది కోట్లు బాకీ ఉన్నారు. నువ్వు అతడి గుమాస్తా రూపంలో వర్తకుల వద్దకు వెళ్ళి ఆ పద్ధెనిమిది కోట్లూ వసూలు చెయ్యి. అనాథపిండకుడి ధనపు బిందెలు పద్ధెనిమిది కోట్ల ధనంతో సహా సముద్రం చేరాయి.
వాటిని తీసుకురా. ఫలాని చోట అనాథపిండకుడికి పద్ధెనిమిది కోట్ల విలువ చేసే ఆస్తి ఉన్నది. ఈ సంగతి ఎవ్వరికీ తెలియదు. ఆ ఆస్తిని అనాథపిండకుడి పరం చెయ్యి, ఆ తరవాత ఆయన వద్దకు వెళ్ళి తొందరపడి ఇల్లు వదిలి వెళ్ళినందుకు క్షమాపణ చెప్పుకుని, తిరిగి రానిమ్మని అడుగు,’’ అని గ్రామదేవత సలహా ఇచ్చింది.
క్షుద్రదేవత ఆ ప్రకారమే వ్యాపారులివ్వవలిసిన పద్ధెనిమిది కోట్లూ వసూలు చేసింది. సముద్రంలోని ధనపుబిందెలను తెచ్చింది. వాటితోబాటు పద్ధెనిమిది కోట్లు విలువచేసే ఆస్తిని కూడా అనాథపిండకుడి కిచ్చి, ‘‘బాబూ, నాకు బుద్ధి వచ్చింది. నన్ను క్షమించి, మళ్ళీ మీ ఇంట ఉండ నివ్వండి,’’ అని బతిమాలింది.
‘‘ఈ క్షమాపణ బుద్ధభగవానుడి ఎదుట చెప్పుకో!’’ అన్నాడు అనాథపిండకుడు క్షుద్రదేవతతో. ఆమె అనాథపిండకుడి వెంట జేతవనానికి వెళ్ళి, బుద్ధుడి ఎదుట జరిగినదంతా చెప్పుకుని క్షమాపణ వేడింది. అంతా విని బుద్ధభగవానుడీ విధంగా అన్నాడు:
‘‘దుష్కర్మ చేసేవాడు తన కర్మ పరిపక్వమయేదాకా తాను మంచి పనే చేస్తున్నాననుకుంటాడు. ఫలితం అనుభవించవలిసి వచ్చినప్పుడు గాని నిజం బోధపడదు.
అదే విధంగా సత్కర్మ చేసేవాడు కూడా తన కర్మ పరిపక్వం చెందే దాకా తాను చేస్తున్నది దుష్కర్మ అనే అనుకోవచ్చు. అతనికి కూడా ఫలం అనుభవించేటప్పుడే నిజం తెలిసివస్తుంది. మొదట చెప్పిన మాటకు ఈ క్షుద్రదేవతే నిదర్శనం.
ఈమె తాను చాలామంచి పని చేస్తున్నాననుకున్నది. రెండవదానికి నిదర్శనం ఈ అనాథపిండకుడు.
ఈయన తాను చెడ్డపని చేస్తున్నాననుకుంటూ ఎంతగానో విచారించాడు. కర్మపరిపాకం అయ్యాకనే, ఎవరిది సత్కర్మో, ఎవరిది దుష్కర్మో బయటపడింది!’’
ఈ మాటలు విన్న తరువాత క్షుద్రదేవత తన బుద్ధి మార్చుకుని, బుద్ధుడియందు ద్వేషం విసర్జించి, గంపెడు పిల్లలతో సహా అనాథపిండకుడి ఇంటిని వదిలి వెళ్ళిపోయింది.
- వివాహ పొంతనలు , శుభ ముహూర్తాలు,జ్యోతిషం , న్యూమరాలజీ(పిల్లల పేర్లు, పెద్దల పేరులో మార్పులు, బిసినెస్ నేమ్స్), సైంటిఫిక్ వాస్తు,ప్రాణిక్ హీలింగ్, జాతక సంబంధ పరిష్కారాలకు(వివాహం, ఉద్యోగం, విదేశీ యానం,గృహం, సంబంధ భా౦దవ్యాలు,శత్రునాశనం,కోర్ట్ కేసు లు ,ఆర్దికలావాదేవీలు,etc), పూజలు,హోమాలు,వివాహ౦,దేవాలయ ప్రతిష్ట, గృహ ప్రవేశ౦ శాంతి పూజలు సర్వీసెస్ కొరకు, ఆధ్యాత్మిక వస్తువుల కొరకు సంప్రదించండి.జ్యోతిష రత్న, జ్యోతిష రత్నాకర, వాస్తు విశారద, విశిష్ట ఆచార్య
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB, BSC, BEd, MCA, GNIIT.
శ్రీ విధాత పీఠం
Ph. no: 9542665536#sreevidhathapeetam #astroremedies #Astrology #muhurtham #vastu #vastutips #numerology
సర్వేజనా సుఖినో భవంతు
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి