శ్రీ శివ మహాపురాణం - 5 వ అధ్యాయం
లింగము - మూర్తి
సూతుడిట్లు పలికెను
శ్రవణ, కీర్తన, మననములనే మూడింటి యందు శక్తిలేనివాడు శంకరుని లింగము నందు, మూర్తి యందు ఆవాహన చేసి, ప్రతిదినము అర్చించి, సంసార సమూద్రమును దాటివేయును . శక్తిని మించకుండా, వంచన లేకుండా ధనమును సంపాదించి, నిత్యము శివుని లింగమునకు, మూర్తికి అర్చన కొరకు అర్పించవలెను .
మండపమును, గోపురమును, సమీపములో జలాశయమును, మఠమును, శిపక్షేత్రమును నిర్మించి, ఉత్సవమును చేయవలెను. వస్త్రమును, గంధమును, పుష్పమాలికలను, ధూపదీపములను భక్తితో అర్పించవలెను . అపూపములతో, పచ్చళ్లతో కూడిన వివిధాన్నములను నైవేద్యము చేయవలెను. ఛత్రము, ధ్వజము, వింజామరలను వీచుట ఇత్యాది సేవల నన్నింటినీ , రాజునకు ఉపచారములు చేసిన తీరున చేయవలెను. మరియు ప్రదక్షిణమును, నమస్కారమును, శక్తిమేరకు జపమును చేయవలెను . ప్రతిదినము ఆవాహనము మొదలుకొని విసర్జనము వరకు భక్తిశ్రద్ధలతో చేయవలెను . ఇట్లు శివుని లింగమును, మూర్తిని అర్చించి , శివుని అనుగ్రహమును పొందిన వ్యక్తి, శ్రవణాదులను విడిచిననూ, సిద్ధిని పొందును. పూర్వము మహాత్ములు లింగమును, మూర్తిని అర్చించుట మాత్రము చేతనే ముక్తిని పొందిరి .
మునులు ఇట్లు పలికిరి
దేవతలందరు మూర్తి రూపములో మాత్రమే పూజింపబడుచుండగా, శివుడు లింగము నందు, మూర్తి యందు కూడ పూజింపబడుటకు కారణమేమి ?
సూతుడిట్లు పలికెను
ముని శ్రేష్ఠులారా! మీరు వేసిన ఈ ప్రశ్న పవిత్రమైనది; విస్మయమును కలిగించునది. దీనికి మహాదేవుడు తక్క సమాధానమును చెప్పగల పురుషుడు మరియొకడు ఎక్కడనూ లేడు . శివునిచేత చెప్పబడి, గురువు నుండి నాచే తెలియబడిన సమాధానమును క్రమబద్ధముగా చెప్పెదను. శివుడు ఒక్కడే పరబ్రహ్మరూపుడు. కావున, ఆయన నిరాకారుడని చెప్పబడును . శివునకు రూపము కూడ ఉండుటచే, ఆయన నిరాకారుడు, సాకారుడా కూడా. ఈశ్వరుడు నిరాకారుడు గనుక, ఆయన నిరాకారమగు లింగము నందు పూజింపబడుచున్నాడు. ఆయన సాకారుడు గనుక మూర్తి యందు కూడ ఆరాధింపబడుచున్నాడు. ఇట్లు ఆయన సాకార, నిరాకార రూపుడగుటచే, పరబ్రహ్మ శబ్దవాచ్యుడగుచున్నాడు.
శివుడు మానవులచే లింగము నందు, మూర్తి యందు కూడ నిత్యము ఆరాధింపబడుచున్నాడు. ఇతర దేవతలు పరబ్రహ్మ రూపులు కాదు గనుక, వారికి నిరాకారత్వము లేదు . కావున, ఇతర దేవతలు బ్రహ్మరూపులు కాక, జీవులగుటచే నిరాకారమగు లింగము నందు ఆరాధింపబడరు . వారు సాకారులు మాత్రమే. గనుక, మూర్తి యందు మాత్రమే ఆరాధింపబడుచున్నారు. శంకరుడు పరబ్రహ్మ; శంకరుని కంటె భిన్నులైన దేవతలు జీవులు . శంకరుని బ్రహ్మత్వము ఉపనిషత్తుల సారముగా, ఓంకారము యొక్క అర్థముగా నిరూపింపబడినది. మందర పర్వతము నందు బ్రహ్మపుత్రుడు, బుద్ధిమంతుడునగు సనత్కుమార మహర్షి నందికేశ్వరుని ఇదే తీరున ప్రశ్నించెను.
సనత్కుమారుడిట్లు పలికెను
శివుని కంటె భిన్నమైన దేవతలను భక్తులు సర్వత్ర , మూర్తి యందు చేయు ఆరాధనను గురించి మాత్రమే వినుచున్నాము; కనుచున్నాము. కేవలము శివార్చన యందు మాత్రమే లింగము, మూర్తి కనబడును . కావున, ఓ మంగళ స్వరూపా! నాకు బాగుగా అర్థమగునట్లు ఈ తత్త్వమును వివరింపుము.
నందికేశ్వరుడిట్లు పలికెను -
ఈ ప్రశ్నకు సమాధానము అసంభవము. ఇది రహస్యమగు బ్రహ్మ విద్య . పాపములు లేనివాడా! భక్తుడవగు నీకు శివుడు చెప్పిన ఈ రహస్యమును చెప్పెదను. శివుడు పరబ్రహ్మ స్వరూపుడు. నిరాకారుడు . శివునికి మాత్రమే లింగము నందు అర్చన వేదములన్నిటి యందు నిర్ణీతమై యున్నది. శివుడు సాకారుడు కూడా . కావున, లోకములో శివుడు మూర్తి రూపములో కూడ పూజల నందుకొనును. శివుని కంటె భిన్నమైన దేవతలు జీవులు, సాకారులు . కనుక, వారికి మూర్తి యందు మాత్రమే అర్చన వేదముచే నిర్ణయింపబడినది. దేవతలు ఆవిర్భవించినప్పుడు సాకారముగనే ఆవిర్భవింతురు . కాని, శివుడు లింగముగను, మూర్తిగను కూడ దర్శనమిచ్చును.
సనత్కుమారుడిట్లు పలికెను -
ఓ మహానుభావా ! , శివునకు లింగము నందు, మూర్తి యందు అర్చన, ఇతర దేవతలకు మూర్తి యందు మాత్రమే అర్చన ప్రచారములో నుండుటకు గల కారణములను విభాగము చేసి, నీవు పరమార్థ దృష్టితో వివరించితివి. కావున, ఓ యోగి శ్రేష్ఠా! నేను శ్రేష్ఠమైన లింగము, మూర్తి ఇత్యాదుల ఆవిర్భావమును గూర్చి వినగోరుచున్నను. ఓ యోగిశ్రేష్ఠా! లింగము ఆవిర్భవించిన విధమును తెలుపుడు.
నందికేశ్వరుడు ఇట్లు పలికెను -
ఓ వత్సా! నీ ప్రీతి కొరకు పరమార్ధమును చెప్పెదను. వినుము . పూర్వకల్పము నందు ప్రలయకాలము సంప్రాప్తము కాగా, మహాత్ములగు బ్రహ్మ విష్ణువులు ఒకరితో నొకరు పోట్లాడుకొనిరి . వారి అహంకారమును తొలగించుటకై, పరమేశ్వరుడు వారి మధ్యలో నిరాకారమగు స్తంభరూపముగా తన రూపమును ప్రదర్శించెను . అపుడు శివుడు లోకముల క్షేమమును గోరి, ఆ స్తంభము నుండి నిరాకారమగు లింగరూపముగా ఆవిర్భవించెను . అప్పటి నుండియు, లోకములో శివునకు మాత్రమే నిరాకారమగు లింగము నందు, సాకారముగ మూర్తి యందు అర్చనలు చేయబడుచున్నవి . శివుని కంటె భిన్నమగు దేవతలకు మూర్తి అర్చన మాత్రమే విహితమైనది.దేవతలు ఆయా మూర్తులను అర్చించినచో, ఆ యా భోగములు, శుభములు కలుగును. శివుని లింగమును, మూర్తిని అర్చించినచో భోగములు, శుభము, మోక్షము కూడ లభించును .
శ్రీ శివ మహా పురాణములో విద్యేశ్వర సంహిత యందు ఐదవ అధ్యాయము ముగిసినది.
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB, BSC, BEd, MCA, GNIIT.
శ్రీ విధాత పీఠం
Ph. no: 9542665536#sreevidhathapeetam #astroremedies #Astrology #muhurtham #vastu #vastutips #numerology
.jpg)
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి