విష్ణుమయం మార్గశీర్షం.....
విష్ణుమయం మార్గశీర్షం.....
మార్గశీర్ష మాసం వచ్చింది. పవిత్రమైన మాసాలలో ఇది ఒకటి. సాక్షాత్తు శ్రీకృష్ణభగవానుడు భగవద్గీతలో
'బృహత్సామ తథా సామం గాయత్రీ ఛందసామహం
మాసానాం మార్గశీర్షిహం ఋతూనాం కుసుమాకరః'
అన్నాడన్న విషయం అందరికీ తెలిసిందే. సామవేదంలో బృహత్సామం, ఛందస్సుల్లో గాయత్రి, మాసాల్లో మార్గశీర్షం,ఋతువుల్లో వసంత ఋతువు నేనని ఆయనే చెప్పారు. మాసాల్లో తాను మార్గశీర్షం అన్నాడంటే ఇక దాని గొప్పతనాన్ని వేరే చెప్పనక్కర్లేదు. ఇది విష్ణుప్రియమైన మాసం. మృగశిర నక్షత్రంతో కూడిన పౌర్ణమి ఉన్నందున ఈ మాసాన్ని మార్గశిరం అంటారు. అలాగే దీనికి మార్గశీర్షం అనే పేరుకూడా ఉంది. దానికి కారణం ఇది జీవనానికున్న మార్గా లలోకెల్లా ఉత్తమమైనదని అర్థం. ఉత్తమ మార్గం వైదిక మార్గం కనుక అది అనుసరించాలని సూచించే మాసంగా పేర్కొంటుంటారు.
మార్గశిర మాసంలో పంటల సమృద్ధి, పూలు పండ్లు ఎక్కువగా లభిస్తాయి. ఒకప్పుడు ఈ మాసంలో కొత్త పంట చేతికొచ్చేది. ఆ కొత్త బియ్యంతో పొంగలి చేసి దేవునికి నివే దించే ఆచారం ఉండేది. మరో పక్క వేదవేత్తలు కొత్త ధాన్యం తో యజ్ఞాలు చేసేవారు. ఆ విధంగా కూడా ఈ మాసం ఉత్కృ ష్టమైనదని పెద్దలు చెబుతారు. ఈమాసం విష్ణు ప్రియం అను కున్నాం. అయితే విష్ణు వక్షస్థల నివాసి అయిన లక్ష్మీదేవికి కూడా ఇది ప్రీతికరం. వాటికంటె కూడా ఈ నెలలో వచ్చే గురువారాలు మరీ ప్రీతికరం. అందుకే ఈ మాసంలో లక్ష్మీదేవికి సంబంధించిన ఒక వ్రతం చేయాలని చెబుతారు. అదే మార్గశిర లక్ష్మీవారవ్రతం. లక్ష్మీవారం అంటే ఏమిటి అనే సందేహం కొన్ని ప్రాంతాలవారికి రావచ్చు. తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో గురువారాన్ని లక్ష్మీవారం అని అంటారు. ఆ పేరుతో ఈ వ్రతం ప్రచారంలోకి వచ్చింది. ఈ వ్రతం ఐశ్వర్య ప్రాప్తినిస్తుంది. స్వయంగా శ్రీకృష్ణుడే ఈ వ్రతాన్ని ఆచరించమని ద్రౌపదికి చెప్పాడని, ఆమె ఆచరించిందని చెబుతారు.
అది కాక దీనికి సంబంధించిన ఒక కథ కూడా ఉంది.
పూర్వం ఒక బాలిక ఉండేది. చిన్న తనంలోనే ఆమె తల్లి చనిపోయింది. సవతి తల్లి పెంచేది. అయితే ఆమెపై ఇంటిపని బరువంతా వేయడంతో పాటు వేధించేది. ఆమె బాధను చూసి ఆ ఊరి ఆలయ పూజారి ఆమెను లక్ష్మీ ఆరాధన చేయమని చెప్పాడు. ఆమె ఎవరి వద్దో లక్ష్మీదేవి చెక్క బొమ్మ ఒక్కకి తెచ్చి దానిని పూజించేది. సవతి తల్లితనకు పుట్టిన బిడ్డను చూడమని, అందుకు గాను బాలికకు ఒక చిన్న బెల్లం ముక్క ఇచ్చేది. దానినే ఈ బారిక లక్ష్మీదేవికి నైవేద్యంగా పెట్టేది ఇలా రోజులు గడిచాయి. బాలిక యుక్త వయస్కురాలయింది. వివాహం చేద్దామనుకున్నారు. ఉత్తముడైన భర్త దొరికాడు. ఆమె చేసిన లక్ష్మీ దేవి పూజ ద్వారా ఆ ఇంటికి వచ్చిన ఐశ్వర్యం ఆమెతో పాటే తరలిపోయింది. ఆమె పుట్టింటి వారు ఆర్థిక బాధలు పడసాగారు. ఇది తెలిసిన ఆమె. వారికి రకరకాలుగా సాయం చేయాలని ప్రయత్నించింది. అయితే ఆమె పంపిన డబ్బు, ఇంగారం వంటివి వారికి చేర కుండా ఏవో అవరోధాలు వచ్చాయి. చివరకు ఆమె ఒకసారి పుట్టింటికి వచ్చింది. మార్గశీర్ష లక్ష్మీవారవ్రతం చేద్దామని చెప్పింది. అయితే మొదటి గురువారం వరకు సవతి తల్లి మొత్తం నాలుగు లక్ష్మీవారాలు ఏదో ఒక విధంగా వ్రత నియ మాలు పొరపాటున ఉల్లంఘించింది. ఐదో లక్ష్మీవారమైనా చేద్దామని సవతి తల్లిని కనిపెట్టి ఉండి వ్రతం చేయించింది. తాను చేసింది. వ్రతం పూర్తయిన తర్వాత ఆమె పెట్టిన నైవేద్యం బూరెలను లక్ష్మీదేవి లీలామాత్రంగ వచ్చి ఆరగించింది. సవతి తల్లి పెట్టిన నైవేద్యాన్ని ఆమె స్వీకరించలేదు. దానికి కారణం ఏమిటని అడగ్గా, ఆమె నిన్ను చిన్నతనంలో కోపం వచ్చినప్పుడు చీపురుతో కొట్టేదని, ఆడపిల్లలు సిరికి ప్రతిరూపాలైనందున వారిని ఆ విధంగా కొట్టినందుకే తాను ఆ నైవేద్యం స్వీకరించలేదని చెప్పింది. దానితో సవతి తల్లి లక్ష్మీ దేవికి క్షమాపణ చెప్పడంతో నైవేద్యాన్ని స్వీకరించి వారికి ఐశ్వర్యాన్నిచ్చిందని కథ.
ఏ పవిత్రమాసమైనా అందరు దేవతలకు ప్రీతికరమని చెప్పాలి. ముఖ్యంగా ఈ మాసంలో శివుణ్ని పొగడ పూలతో అర్చిస్తే కైలాసానికి వెళ్లవచ్చని పెద్దల మాట. ఇది కాక ఈ నెలలోనే జ్ఞాన స్వరూపుడు, సంతానాభివృద్ధికి అధిదేవుడైన సుబ్రహ్మణ్యేశ్వరుని ఆరాధించే సుబ్రహ్మణ్య షష్టి వస్తుంది. సుబ్రహ్మణ్య షష్ఠినే కొన్ని చోట్లస్కంద షష్ఠి అంటారు. అలాగే సాక్షాత్తు శ్రీకృష్ణునికి సంబంధించిన గీతా జయంతి, గురు స్వరూపుడైన దత్తాత్రేయుల వారి జయంతి వంటి పర్వాలు కూడా వస్తాయి. ఈ మాసంలో గంగా స్నానం చేస్తే కోటి గ్రహణ స్నానాలు చేసిన పుణ్యం వస్తుందని చెబుతారు. ఈ నెలలో విశేషంగా విష్ణుసహస్రనామ పారాయణ, విష్ణు ఆరాధన, విష్ణ్వాలయాల సందర్శన అధిక పలాన్ని ఇస్తుంది.
HAVANIJAAA
(M.A (Astro), M.A.(Telugu) , M.A.(English), M.A( Sanskrit), MSW, LLB, BSC, BEd, MCA, GNIIT.
శ్రీ విధాత పీఠం
Ph. no: 9542665536#sreevidhathapeetam #astroremedies #Astrology #muhurtham #vastu #vastutips #numerology

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి